World Soil Day : నేడు నేల దినోత్సవం.. ఏంటి దీని ప్రత్యేకత?
World Soil Day : ప్రతీ సంవత్సరం డిసెంబర్ 5న ప్రపంచ నేల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి ప్రపంచ దేశాలు. ఈ దినోత్సవానికి కారణమేంటి? ఎందుకు? చరిత్రలో ఏం జరిగిందో తెలుసుకుందాం.
World Soil Day : మనందరికీ స్వాతంత్ర్య దినోత్సవం, వాలెంటైన్స్ డే వంటివి తెలుసుగానీ.. ప్రపంచ నేల దినోత్సవం అనేది ఒకటుందని తెలియదు. ఎందుకంటే దీని గురించి అంతగా ప్రచారం జరగట్లేదు. కానీ ఇది చాలా ముఖ్యమైనది. మనం జీవించేందుకు నేల కావాలి. ఆహారం పండేందుకు నేల కావాలి. నేల లేనిదే మనం లేము. అలాంటి నేలకు మనం తగిన ప్రాధాన్యం ఇస్తున్నామా? నేలను పట్టించుకుంటున్నామా అన్నది నేటి ప్రశ్న.
ప్రపంచమంతా ఇదే పరిస్థితి. మనుషులు నేల నుంచి అన్నీ పొందుతున్నారు. కానీ ఆ నేలను నాశనం చేస్తున్నారు. భూ కాలుష్యం, పురుగుమందులు, యుద్ధాలు ఇలా ఎన్నో అంశాలు నేలను పనికిరాకుండా చేస్తున్నాయి. కూర్చున్న కొమ్మనే నరుక్కోవడం అంటే ఇదే కదా. ఈ సమస్యల్ని ప్రస్తావించేందుకు ఉన్నదే ప్రపంచ నేల దినోత్సవం.
భూగోళంపై మూడొంతులు నీరే ఉంది. భూమి ఉన్నది ఒక వంతే. అదీకాక.. ఈ విశ్వంలో మనం జీవించేందుకు ప్రస్తుతానికి ఉన్న ఒకే ఆప్షన్ భూమి. అంటే అది అమూల్యమైనది. దాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. దీనిపై అవగాహన కలిగించేందుకే ఏటా డిసెంబర్ 5న ప్రపంచ నేల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
పంచభూతాల్లో ఒకటైన భూమి లేకపోతే.. ఈ ప్రపంచమే లేనట్లు. సకల జీవరాశి మనుగడకీ భూమి కీలకం. కానీ వాతావరణ మార్పులు, భూతాపం, కాలుష్యం.. మన భూమినీ, నేలనూ నానాటికీ పనికిరాకుండా చేస్తున్నాయి. 2002లో అంతర్జాతీయ సాయిల్ సైన్సెస్ యూనియన్ (IUSS).. డిసెంబర్ 5న నేల దినోత్సవం జరిపేందుకు తీర్మానం చేసింది. అలా ఇది మొదలైంది.
2015 సంవత్సరాన్ని అంతర్జాతీయ నేలల సంవత్సరంగా ప్రకటించారు. ఏటా నేల దినోత్సవం నాడు విద్యార్థులకు దీనిపై అవగాహన కలిగిస్తున్నారు. నేలను కాపాడకపోతే.. చెట్లు పెరగవనీ.. పంటలు పండవనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
ప్రస్తుతం భూమి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రోజూ లక్షల టన్నుల చెత్త భూమిపై పేరుకుపోతోంది. ప్లాస్టిక్ వాడకం భూమికి హానికరంగా మారింది. డ్రైనేజీ, మురుగు నీరంతా సముద్రాల్లో కలుస్తూ.. వాటిని కాలుష్యం చేస్తున్నాయి. అంతటా ఇదే పరిస్థితి. దీని వల్ల నేలలో సహజ సారం దెబ్బతింటోంది. పంటల దిగుబడి బాగా తగ్గింది. దిగుబడిని పెంచేందుకు ఎరువుల వాడకం విపరీతంగా పెరిగింది. దీని వల్ల భూమి సారహీనం అవుతోంది.
ఇలాంటి రోజు వచ్చినప్పుడు మనం విచారం వ్యక్తం చేస్తాం. మర్నాడు మళ్లీ మామూలే. రోజువారీ పనుల్లో పడి మనం భూమిని కాపాడాలనే అంశాన్ని మర్చిపోతాం. అందుకే పరిస్థితులు మారట్లేదు. ప్రతి ఒక్కరం ఎంతో కొంత ప్రయత్నించడం ద్వారా భూమికి జరిగే నష్టాన్ని కొంతైనా తగ్గించవచ్చంటున్నారు భూగర్భ శాస్త్రవేత్తలు. సంప్రదాయపద్ధతుల్లో పంటలు పండించాలని కోరుతున్నారు. నీటి వృథాను తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. అడవుల పెంపకం ద్వారా భూసారం పెరుగుతుందని చెబుతున్నారు.
No comments:
Post a Comment